తెలంగాణ ప్రభుత్వం అందించిన సాయానికి గొప్ప మనసుతో కృతజ్ఞత చూపిన శ్రీకాంత్ అనే యువకుడికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సీఎం ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్స్ పథకం పేద విద్యార్థులకు ఉపయోగపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. కరోనాపై పోరాటానికి తనవంతుగా సాయం చేసిన యువకుడిని కేటీఆర్ అభినందించారు.
'నా పేరు శ్రీకాంత్ శరవణ్. మా నాన్న ఆటో డ్రైవర్. నేను ఉన్నత స్థానంలో ఉండాలని ఆయన ఎప్పుడూ కోరుకునేవారు. కానీ, తన ఒక్కడి సంపాదన, మా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అది వీలుకాదని బాధపడుతుండేవారు. ఉన్నత చదువుల కోసం సరైన సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ అందించి ఆదుకుంది. ఇప్పుడు నేను మంచి పొజిషన్‌లో ఉన్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో నన్ను ఆదుకున్న ప్రభుత్వం, ప్రజల కోసం ఎంతో కొంత సాయం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. కరోనాపై పోరాటానికి నా వంతు సాయంగా సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళం అందించాను.' అని మంత్రి కేటీఆర్‌కు శ్రీకాంత్ ట్వీట్ చేశాడు.