దేశవ్యాప్త లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వలస కూలీలు, నిరుపేదలు ఏ ఒక్కరూ ఆకలితో అలమటించొద్దన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైల్వే మంత్రిత్వశాఖ తమ వంతు చేయూతను అందిస్తుంది. ప్రతీ రోజు 2.6 లక్షల ఆహార పొట్లాలను అన్నార్థులకు అందించేందుకు సిద్ధమైంది. రైల్వే కిచెన్స్ వేడి వేడిగా ఆహారాన్ని వండి అందించనున్నాయి. దేశవ్యాప్తంగా ఆయా జిల్లాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ ఆహార పొట్లాలను అందించనుంది.
ఈ విషయమై జోన్లవారీగా ఉన్న చికెన్ ఇన్‌ఛార్జీలు ఆయా రాష్ర్టాల్లోని అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. అవసరార్థులు, అన్నార్థులు పెరిగితే అందించే ఆహార పొట్లాల సంఖ్యను కూడా పెంచనున్నట్లు రైల్వే పేర్కొంది. ఒక్కో ఆహార పొట్లాన్ని రూ. 15కే అందిస్తున్నట్లు తెలిపింది. ఈ మొత్తాన్ని తర్వాతి కాలంలో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వసూలు చేసుకోనున్నట్లు వెల్లడించింది. ఇండియన్ రైల్వే ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రతీరోజు లక్ష వరకు ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు. మార్చి 28వ తేదీ నుంచి రైల్వే సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తున్నట్లు తెలిపింది.